కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే రేషన్..!
Ration for corona vaccination persons only. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలంలో వ్యాక్సిన్ తీసుకుంటేనే రేషన్, ఆసరా పింఛన్లు ఇస్తామని శనివారం చాటింపు వేయించారు.
By తోట వంశీ కుమార్ Published on 25 April 2021 5:09 AM GMTదేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తున్నప్పటికీ.. కొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. వ్యాక్సిన్ ఫై అవగాహన లేకపోవడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు అధికారులు ముందుకు వచ్చారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలంలోని గ్రామాల్లో అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. వ్యాక్సిన్ తీసుకుంటేనే రేషన్, ఆసరా పింఛన్లు ఇస్తామని శనివారం చాటింపు వేయించారు. తహసీల్దార్ సువర్ణ రేషన్ డీలర్లతో సమావేశమై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంట్లలో 1,08,602 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 8,126 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,232 కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా కారణంగా 38 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,999కి పెరిగింది.
నిన్న 3,307 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,30,304కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 62,929కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.50 శాతంగా ఉండగా, రికవరీ రేటు 83.57 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1259 కేసులు ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 676, రంగారెడ్డి జిల్లాలో 591, నిజామాబాద్‌లో 497, నల్లగొండలో 346, ఖమ్మలో 339, వరంగల్ అర్బన్‌లో 334, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 306, కరీంనగర్లో 286, జగిత్యాలలో 264, మంచిర్యాలలో 233, సంగారెడ్డిలో 201 చొప్పున నమోదయ్యాయి.