TSRTC : మునగాల మండలంలో దగ్థమైన రాజధాని బస్సు
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం దగ్థమైంది.
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 11:40 AM ISTమంటల్లో దగ్థమవుతున్న రాజధాని బస్సు
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్నాయి. బస్సు కిందకు బైక్ దూసుకువెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం దగ్థమైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మియాపూర్ డిపోకు చెందిన రాజధాని బస్సు ప్రయాణీకులతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెలుతోంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ కు సమీపంలో బస్సు స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ బస్సు కిందకు వెళ్లిపోయింది. మంటలు చెలరేగాయి. బస్సుకు మంటలు వ్యాపించాయి.
అప్రమత్తమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణీకులను హెచ్చరించడంతో వారు వెంటనే బస్సును దిగారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపుచేసేటప్పటికే బస్సు పూర్తిగా దగ్థమైంది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెలుతున్న మురుగేష్ రాజు(48)కు తీవ్రగాయాలు అయ్యాయి. అతడిని సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడు మునగాల మండలం ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తి.
ఈ ఘటన కారణంగా నేషనల్ హైవే 65 పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.