సీఎం రేవంత్‌కు వార్నింగ్‌ పోస్టర్‌.. రాజకీయ వర్గాల్లో కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ కార్యకర్త పేరుతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఉంచిన రాజకీయ పోస్టర్ గురువారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

By అంజి  Published on  25 Oct 2024 8:00 AM IST
Rajanna Sircilla, CM Revanth, political circles, Telangana

సీఎం రేవంత్‌కు వార్నింగ్‌ పోస్టర్‌.. రాజకీయ వర్గాల్లో కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ కార్యకర్త పేరుతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఉంచిన రాజకీయ పోస్టర్ గురువారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అర్హులైన వారికి రేషన్‌కార్డుల మంజూరు విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని పోస్టర్‌లో పేర్కొన్నారు. మేధావి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యపై ఆలోచించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని పోస్టర్‌లో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డులు పొందని అర్హులైన నిరుపేదలు కార్డుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, రేషన్‌కార్డులు లేకుంటే చాలా మందికి లేబర్‌కార్డులు అందడం లేదని, సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారని అన్నారు.

తక్షణమే రేషన్‌కార్డుల మంజూరుకు సీఎం చర్యలు తీసుకోవాలని, అయితే మాయ మాటలతో ప్రజలను మోసం చేయకూడదన్నారు. సీఎం, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఖబర్దార్‌ అని హెచ్చరిస్తూ పోస్టర్‌పై కాంగ్రెస్‌ జెండా మోసిన కార్యకర్త అని సంతకం చేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు కావాలనే.. కాంగ్రెస్‌ కార్యకర్తల పేరుతో పోస్టర్లు ఉంచారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా లేరని అందుకే ప్రభుత్వాన్ని, సీఎంను హెచ్చరిస్తూ పోస్టర్లు ఉంచారని బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలను తప్పుబట్టారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలోని గాంధీచౌక్‌కు చేరుకున్న పోలీసులు పోస్టర్‌ను తొలగించారు.

Next Story