ఆ జైలు పాలైన వ్యక్తితో కలిసి పని చేయలేను: రాజగోపాల్‌ రెడ్డి

Rajagopal Reddy wrote a letter to Sonia Gandhi regarding resignation. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి లేఖ రాశారు.

By అంజి  Published on  4 Aug 2022 12:21 PM GMT
ఆ జైలు పాలైన వ్యక్తితో కలిసి పని చేయలేను: రాజగోపాల్‌ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి లేఖ రాశారు. లేఖలో తన రాజీనామాకు దారి తీసిన పరిణామాలను వివరించారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా, అధిష్ఠానం ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీ పడకుండా చేశానన్నారు. కష్టాలు, కన్నీళ్లు దిగమింఉకుంటూ పార్టీ ప్రతిష్ఠ కోసం, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించానన్నారు. కానీ, గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ, విస్మరిస్తూ, పార్టీ ద్రోహులకు కీలక బాధత్యలు అప్పగించటం తనను తీవ్రంగా బాధించిందన్నారు.

ఇప్పటికే అనేక పార్టీలు మారి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని సోనియాకు రాసిన లేఖలో రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని.. అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేశారని గుర్తు చేశారు. అందరి చొరవతో సాకారమైన తెలంఆణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబం చేతిలో బంధీ అయిందన్నారు. ఈ బంధీ నుంచి విడిపించేందుకు తెలంగాణలో మరో ప్రజాస్వామిక పోరాట అవసరం ఉందని తాను నమ్ముతున్నానన్నారు.

అనేక జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్‌ పార్టీని నిర్వీర్యం చేశారన్నారు. అందుకే సబ్బండవర్గాలు కోరుకున్న ప్రజా తెలంగాణలో, ప్రజస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని తాను నిర్ణయించుకున్నాని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను కాంగ్రెస్‌ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని సోనియా గాంధీకి రాసిన లేఖలో రాజగోపాల్‌ రెడ్డి వివరించారు.

రాజగోపాల్‌ రెడ్డి.. ఈ నెల 8న తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించనున్నారు. ఈ మేరకు స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు.

Next Story