తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కాగా తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరిస్తున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. మరో రెండ్రోజుల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ రుతుపవనాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న మూడ్రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఐదు నుంచి ఏడు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. విస్తారంగా వర్షాలు కురవడం వల్లే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సోమవారం నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.