ఆకాశంలో అద్భుతం..
Rainbow colours around the sun.ఎన్నో అద్భుతాలకు ఆకాశం నెలవు. తాజాగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2021 1:49 PM ISTఎన్నో అద్భుతాలకు ఆకాశం నెలవు. తాజాగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ ఇంధ్రధనస్సు మాదిరిగా ఓ వలయం ఏర్పడింది. సుమారు ఓ గంట పాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి సహా పలు చోట్ల ఈ సుందర దృశ్యం కనిపించింది. ఉదయం 10 గంటల నుంచి ఇలా కనిపిస్తోందని కొందరు స్థానికులు అంటున్నారు. ఈ దృశ్యాన్ని చూడ్డానికి జనం నగరంలో పలు చోట్ల గుమిగూడారు. తమ మొబైల్ ఫోన్లలో బంధించి మురిసిపోయారు.
గత నెలలో ఇలాంటి దృశ్యం బెంగళూరులో కూడా దర్శనమిచ్చింది. అప్పట్లో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని 'సన్ హాలో' అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచిక అంటారు. దట్టమైన మేఘాలు ఏర్పడి వాటిలో ఘనీభవించిన నీటి బిందువులపై సూర్యకిరణాలు పడినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు అంటున్నారు. మంచు బిందువులపై పడిన కిరణాలు పరావర్తనం చెంది ఇలా ఇంధ్రదనస్సు రంగుల్లో కనిపిస్తాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. సూర్యుడు చుట్టూ వలయాకారం ఏర్పడటం అశుభమంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను నమ్మొద్దని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని "22-డిగ్రీ హలోస్" అని పిలుస్తారని తెలిపారు.