దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. యథావిధిగా రైళ్ల రాకపోకలు

Railway track damaged due to derailment near Hyderabad restored. హైదరాబాద్: విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం

By అంజి  Published on  16 Feb 2023 4:30 AM GMT
దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. యథావిధిగా రైళ్ల రాకపోకలు

హైదరాబాద్: విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం బీబీనగర్-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) పునరుద్ధరించింది. పట్టాలు తప్పిన కోచ్‌లను సెక్షన్ నుండి క్లియర్ చేసిన తర్వాత, రైల్వే ట్రాక్, ఓవర్ హెడ్ విద్యుత్ సరఫరా రెండింటికి సంబంధించి పునరుద్ధరణ పనులను పూర్తి చేసింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌-కాజీపేట మధ్య రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రైలు నంబర్ 17229 (త్రివేండ్రం సెంట్రల్ నుండి సికింద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్) రాత్రి 9.15 గంటలకు సెక్షన్ దాటిన మొదటి రైలు.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఎస్4 నుండి ఎస్1 వరకు నాలుగు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, ఒక జనరల్ కోచ్, రైలులోని లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్ నిన్న ఉయదం 06.10 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఎస్‌సీఆర్‌ అధికారుల ప్రకారం.. 16 కోచ్‌లతో కూడిన రైలులో మిగిలిన భాగం ప్రభావితం కాలేదు. సమాచారం అందుకున్న తర్వాత, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ (ART), మెడికల్ రిలీఫ్ వ్యాన్ (MRV) సహాయ, పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు వైద్య సిబ్బందితో సహా రైల్వే అధికారుల బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రైల్వే, వైద్య సిబ్బంది రైలులో అత్యవసర వైద్యం, ఇతర అవసరాల కోసం ప్రయాణికులను తనిఖీ చేశారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ప్రయాణికులెవరూ గాయపడలేదని తేలింది.

పట్టాలు తప్పిన కోచ్‌లలోని ప్రయాణికులను ప్రభావితం కాని కోచ్‌లకు తరలించారు. ప్రయాణికులతో పాటు ప్రభావితం కాని కోచ్‌లతో కూడిన రైలు ఉదయం 7.40 గంటలకు సంఘటనా స్థలం నుండి బయలుదేరి 8.40 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. ఎస్‌సీఆర్‌ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజన్ డీఆర్‌ఎస్‌ ఏకే గుప్తా వారి బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యక్తిగతంగా, పట్టాలు తప్పిన ప్రదేశంలో సహాయ, పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. సెక్షన్‌లోని రెండు లైన్లలో ఒకటి పట్టాలు తప్పడం, ఒకటి బ్లాక్ చేయడం వల్ల తొమ్మిది రైళ్లు రద్దు చేయబడ్డాయి, 19 పాక్షికంగా రద్దు చేయబడ్డాయి, ఏడు రీషెడ్యూల్ చేయబడ్డాయి, ఆరు దారి మళ్లించబడ్డాయి. కాగా త్వరలోనే రైళ్లను మళ్లీ రీషెడ్యూల్‌ చేయనున్నారు.

Next Story