తెలంగాణలో అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తాం: రాహుల్‌గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 2:18 PM ISTతెలంగాణలో అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తాం: రాహుల్‌గాంధీ
తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన విజయభేరి బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పుకొచ్చారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కుల గణన విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
కుల గణన దేశానికి ఎక్స్‌రేలా పని చేస్తుందని, కుల గణనపై తాను మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి కానీ, తెలంగాణా సీఎం కానీ ఏమీ అనరు అంటూ చెప్పుకొచ్చారు. బీహార్ ప్రభుత్వం ఇటీవల తన కుల గణన నివేదికను 2023కి ప్రచురించింది, వివిధ కుల సమూహాల్లో రాష్ట్ర జనాభా పంపిణీపై వివరణాత్మక డేటాను వెల్లడించిందన్నారు రాహుల్‌గాంధీ. కాగా.. ఈ నివేదిక కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి సర్వేలు అవసరమని దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
కుల గణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను వెల్లడించాలని కేసీఆర్‌ను కోరారు రేవంత్‌రెడ్డి. అయితే.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కుల సర్వేను కాంగ్రెస్ ప్రధానాంశంగా మార్చుకుంది. అంతకుముందు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ కుల గణన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. దేశంలోని పేదల విముక్తి కోసం ఇది "ప్రగతిశీల మరియు శక్తివంతమైన అడుగు" అని ఆయన అభివర్ణించారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) దేశవ్యాప్త కుల గణనను కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. SC, ST, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ను చట్టం ద్వారా తొలగించి, వారి జనాభా ప్రకారం వారికి ప్రాతినిధ్యం కల్పించాలని ప్రతిజ్ఞ చేసింది. కుల గణన కోసం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి పెంచుతోంది. అనేక బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు కులాల సర్వేలు నిర్వహించడం, అలా చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేయడంతో.. నవంబర్‌లో వెనుకబడిన తరగతుల కుల గణనను ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం తెలిపింది.