ఖమ్మంలో కాంగ్రెస్ సభ సక్సెస్.. వరాలు కురిపించిన రాహుల్
ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ సక్సెస్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 3 July 2023 9:46 AM ISTఖమ్మంలో కాంగ్రెస్ సభ సక్సెస్.. వరాలు కురిపించిన రాహుల్
ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ సక్సెస్ అయ్యింది. సుమారు వంద ఎకరాల్లో నిర్వహించిన సభకు ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారు. ఇసుకవేస్తే రాలనంత జనం హాజరయ్యారు. ఇక రాబోయే ఎన్నికల్లో తమకు మద్దతు ఎంత ఉంటుందో ఈ సభ ద్వారే అర్థమయ్యిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అధికార పార్టీ కాంగ్రెస్ జనగర్జన సభను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయాత్నాలు చేసినా ఫలించలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బస్సులు, అన్ని ప్రైవేట్ వాహనాలను అద్దెకు ఇవ్వకుండా చేసినా, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నా ప్రజలు సభకు హాజరయి మద్దతు తెలిపారని అంటున్నారు. జనసంద్రాన్ని చూసిన రాహుల్‌గాంధీ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. జనం మద్దతు చూసి ఖమ్మంలో అసెంబ్లీ స్థానాలన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.
కాంగ్రెస్ పార్టీ గతంలో వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. తాజాగా ఖమ్మంలో సభలో రాహుల్ గాంధీ చేయూత పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద పెన్షన్లు రూ.4వేలకు పెంచుతామని వెల్లడించారు. ఇటీవలే వికాలంగులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.4,116కి పెంచింది. ఖమ్మంలో రాహుల్ ప్రకటనతో మిగిలిన స్కీమ్‌లకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ సమీక్ష చేసుకోవాలసిన పరిస్థితి ఏర్పడింది.
సభ ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల కలలు కలలుగానే మిగిలిపోయాయని అన్నారు. రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిందని విమర్శించారు. కేసీఆర్ తనకు తాను ఒక రాజుగా.. తెలంగాణను తన జాగీరుగా భావిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ పేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కున్నారని.. కాంగ్రెస్ ఇచ్చిన భూములు కేసీఆర్ సొత్తు కాదని ఫైర్ అయ్యారు. ధరణి పేరుతో వేల ఎకరాలను దోచుకున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ రూ.4000 అందిస్తామని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్‌గా పనిచేస్తుందని.. కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని చెప్పారు. కర్ణాటకలో లాగే తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు తమ శక్తిని చూపి.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాహుల్‌గాంధీ సూచించారు.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను కొల్లగొట్టిందని అన్నారు. బీఆర్‌ఎస్ అడ్డుగోడలను దాటుకుని సభను విజయవంతం చేసిన అందరికీ రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 9 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రాహుల్‌గాంధీకి సభ ద్వారా రేవంత్‌రెడ్డి మాట ఇచ్చారు. రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కాంగ్రెస్ పాలన ఉంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు.