కరోనా వైరస్‌ను నియంత్రించడంతో బాగంగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం తీసుకొచ్చింది. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానానికి స్వస్తి పలికి, సరుకులు తీసుకోవాలంటే లబ్ధిదారులు తమ సెల్‌ఫోన్లకు వచ్చిన ఓటీపీ చూపించాలని నిబంధన తీసుకొచ్చారు. అయితే.. అసలు చిక్కు అక్కడే వచ్చింది. రేషన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా వారి ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు తీసుకోవడం వీలవుతుంది.
ఈ విధానం అమల్లోకి రావడంతో ఆధార్-సెల్‌ఫోన్ నంబరు అనుసంధానం లేని వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆధార్ కేంద్రాల వద్ద రేషన్ కార్డుదారులు బారులు తీరుతున్నారు. ఆదిలాబాద్ ఆధార్ కేంద్రం వద్ద తెల్లవారు జామునుంచే క్యూలో నిలబడ్డారు. అలాగే.. పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతోంది. భారీ సంఖ్యలో ప్రజలు ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతుండడంతో అక్కడి సిబ్బంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆధార్ కేంద్రాన్ని సిబ్బంది తెరవడం లేదని స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జాం అవుతోంది. పలు జిల్లాలలో వృద్ధులు, మహిళలు ఉదయం నుంచే ఆధార్ కేంద్రాల వద్ద నిలబడ్డారు. తెలంగాణలో మొత్తం 87లక్షల 44వేల 251 రేషన్ కార్డు లబ్దిదారులు ఉన్నారు.