తెలంగాణలోని విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కొనసాగించాలి : హైకోర్టు
Provide online classes Telangana High Court tells government.తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై గురువారం
By తోట వంశీ కుమార్ Published on 3 Feb 2022 12:28 PM IST
తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులకు హాజరు కానివారి కోసం ఆన్‌లైన్ క్లాసులను ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగించాలని తెలిపింది. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాల్లో కరోనా నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని ఆదేశించింది.
మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ధ కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని.. నిబంధనలు ఉల్లంగించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పేర్కొంది. ఈ నెలలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరలో కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని సూచించింది. ముచ్చింతల్ లో జరుగుతున్న సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కూడా నిబంధనలు అమలయ్యేలా చూడాలని తెలిపింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రజలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం కనీస బాధ్యత అని కోర్టు గుర్తు చేసింది. రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
తెలంగాణలో కొత్తగా 2,646 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం రాత్రి విడుదల చేసిన బులిటెన్‌లో ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 3,606 మంది కోలుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 34,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు.. రాష్ట్రంలో మొత్తం 3,23,02,160 కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించారు. వాటిలో 7,69,407 పాజిటివ్‌గా పరీక్షించబడగా.. 7,30,648 మంది కోలుకున్నారు.