సీయం - గవర్నర్ మధ్యలో ప్రోటోకాల్ వార్
Protocol Issue Between Telangana Government And Governor. గత ఏడాదికాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య నెలకొన్న వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది.
By Nellutla Kavitha
గత ఏడాదికాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కి మధ్య నెలకొన్న వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది. ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ తర్వాత ఈ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిజెపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నాయంటూ సభకు హాజరైన జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు.
ముఖ్యమంత్రిగా ఉండి గవర్నర్లను ఎలా అవమానిస్తారని, సీఎం కేసీఆర్ గవర్నర్ల వ్యవస్థను అవహేళన చేశారని మండిపడ్డారు తమిళిసై. 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో తాను ఉన్నానని ప్రోటోకాల్ పై ముఖ్యమంత్రి స్పందించిన తర్వాతే, రాష్ట్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తానని అన్నారు గవర్నర్. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ సీఎం స్టాలిన్‌ను, తెలంగాణ గవర్నర్ సీయం కేసీఆర్‌ను, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడి ప్రభుత్వాన్ని, పంజాబ్ గవర్నర్ సీయం భగవంత్ మాన్‌ను ఇబ్బందిపెడుతున్నారని, అయితే రాష్ట్రాల గవర్నర్లు అమాయకులని వారితో ఇబ్బందులు పెట్టించేలా కేంద్రమే చేయిస్తుందని సభకు హాజరైన ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ వ్యవస్థ అంటే ఎందుకు తెలంగాణ ప్రభుత్వానికి చిన్న చూపో చెప్పాలని,ప్రోటోకాల్ ఎందుకు పాటించట్లేదంటూ ప్రశ్నించారు.
దూరం ఎప్పుడు మొదలైంది?!
పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిపాదించి గవర్నర్ కు ఫైల్ ను పంపించినప్పుడు తమిళిసై దానిని తిరస్కరించారు. అప్పటి నుంచే రాజభవన్ కు, ప్రగతిభవనకు మధ్య దూరం ప్రారంభమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అది స్పష్టంగా కనిపించింది. గతేడాది రాజ్‌భవన్‌లో జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరుల హాజరుకాలేదు. అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి బిల్లులను గవర్నర్ రాజభవన్లో పెండింగ్లో ఉంచారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. రాజభవన్ ను రాజకీయాలకు అడ్డాగా మార్చారని, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి వ్యవస్థ అర్థం మారిందని తెలంగాణ ప్రభుత్వం విమర్శిస్తుంది. అయితే ఆ బిల్లుల కంటే కూడా ప్రోటోకాల్ అంశం ఎప్పటినుంచో పెండింగ్లో ఉందని గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు.
అసలేంటి ప్రోటోకాల్ వివాదం?!
ఏడాది కాలంగా తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తోందని గవర్నర్ తమిళిసై అన్నారు. భద్రాచలం వరద ముంపు ప్రాంతాల బాధితుల దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా కలెక్టర్ తో పాటుగా జిల్లా ఎస్పీ కూడా రాలేదని, గవర్నర్ వచ్చినప్పుడు పాటించాల్సిన ప్రోటోకాల్ అనుసరించలేదని గతంలోనే గవర్నర్ విమర్శించారు. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లినప్పుడు కూడా ప్రోటోకాల్ ని అనుసరించి తనను కలెక్టర్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి స్వాగతం పలకలేదు. ఉగాది పండగ రోజు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నప్పుడు కూడా అధికారులు ప్రొటోకాల్ పట్టించుకోలేదు. కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించలేదని వార్తలు వచ్చాయి. ఇక గవర్నర్ తల్లి కృష్ణకుమారి 2021 ఆగస్టులో మరణించినప్పుడు కూడా సీఎం కేసీఆర్ వచ్చి పరామర్శించలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని గవర్నర్ గతంలోనే ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మధ్యకాలంలో కలిసింది రెండుసార్లే
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ బుయాన్ 28 జూన్ 2022న రాజుభవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన ఈ కార్యక్రమానికి చాలా కాలం తర్వాత సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కలిసి సీఎం కేసీఆర్ గవర్నర్తో కాసేపు భేటీ అయ్యారు. ఇక నూతన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకడానికి మరోసారి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై రెండోసారి కలిశారు. రాష్ట్రపతికి వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ సమావేశంలోనూ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు.
అయితే ఈసారి జరగబోతున్న గణతంత్ర దినోత్సవాల తో పాటుగా బడ్జెట్ సమావేశాల గురించి ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు గవర్నర్. ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని గవర్నర్ విమర్శించారు. అయితే ఈ ప్రోటోకాల్ వివాదంపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించారు. ఎవరైనా గౌరవం కాపాడుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు, ఇప్పటివరకు ప్రభుత్వం పంపించిన ఏడు బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా తనవద్దే పెట్టుకున్నారని, మరి అభివృద్ధి ఎలా జరుగుతుందనే ఆలోచన చేయాలని, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లులను కూడా ఆపడం ఏంటని ప్రశ్నించారు.