బస్సు డిపోలు ప్రైవేటీకరణ అంటూ ప్రచారం.. నిజం లేదన్న ఆర్టీసీ యాజమాన్యం

తెలంగాణ ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.

By Knakam Karthik
Published on : 23 Jan 2025 7:30 AM IST

telangana, tgsrtc on privatization, rtc clarity

బస్సు డిపోలు ప్రైవేటీకరణ అంటూ ప్రచారం.. నిజం లేదన్న ఆర్టీసీ యాజమాన్యం

తెలంగాణ ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. రాష్ట్రంలోని డిపోల కార్యకలాపాలన్నీ ఆర్టీసీ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ప్రచారం పూర్తి అవాస్తమని పేర్కొంది. ఎలక్ట్రిక్ బస్సుల మెయింటనెన్స్, చార్జింగ్ మినహా పూర్తి నిర్వహణ బాధ్యతలు అన్నీ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ మేరకే పర్యావరణహితమైన విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పాలసీ ప్రకారం హైదరాబాద్‌తో సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, తదితర ఏరియాల్లో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. 2023 మార్చిలో కేంద్రప్రభుత్వ నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (ఎన్ఈబీపీ) కింద 550 ఇంటర్ సిటీ విద్యుత్ బస్సులు, 500 సిటీ బస్సులకు సొంత టెండర్ ద్వారా ఆర్డర్ ఇచ్చామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. వాటిలో 170 సిటీ, 183 జిల్లాల బస్సులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. ప్రైవేట్ సంస్థల జాప్యం కారణంగా మిగతా విద్యుత్ బస్సులు రావడంలో జాప్యం జరుగుతోందని, ఈ ఏడాది మే నెల లోపు మిగిలిన బస్సులను అందిస్తామని సదరు ప్రైవేట్ సంస్థలు పేర్కొన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

Next Story