2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి: డిప్యూటీ సీఎం భట్టి
ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదని.. దేశ నిర్మాణానికి వేదికలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By అంజి Published on 3 Jan 2025 12:00 PM IST2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదని.. దేశ నిర్మాణానికి వేదికలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐఐటి హైదరాబాదులో ఇప్పటివరకు 11,500 పరిశోధన ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు, స్టార్టప్‌ల ద్వారా రూ.1500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గొప్ప మార్పుగా తాము చూస్తున్నామన్నారు. ఐఐటీ కందిలో నిర్వహించిన హైదరాబాద్- ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరుకు చిరునామా ఐఐటి హైదరాబాద్ అని, ఇది కలల కర్మాగారం అని అన్నారు.
ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ కింద మోనాష్ యూనివర్సిటీ సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు కేవలం తెలంగాణ,భారతదేశానికే కాదు.. ప్రపంచానికే కీలకమని, తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించడంలో ఈ వర్క్ షాప్ సహకార స్ఫూర్తికి అద్దం పడుతుందన్నారు. ఐఐటీలకు ఆధ్యుడైన పండిట్ నెహ్రూ.. వీటిని ఆయన ఆధునిక భారతదేశ దేవాలయాలుగా అభివర్ణించారని భట్టి తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పేదరికం, అసమాన తలపై పోరాడడానికి అవసరమైన సాధనాలుగా ఐఐటీలను నెహ్రూ అభివర్ణించారు
''ఐఐటి హైదరాబాదుకు నాటి సీఎం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. వారి నాయకత్వంలో నే పునాదులు పడ్డాయి. నాడు ఎమ్మెల్సీగా నేను భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణలో క్లిష్టమైన ఖనిజాలను వెలికి తీసేందుకు సమర్థవంతమైన మార్గాలు కనుగొనడం, స్థిరమైన మైనింగ్ పద్ధతులు అవసరమని మేము గుర్తించాము. అందుకే మా తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పరిశోధన. వాటి సంబంధిత సైన్స్ ఆధార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుంది. క్లిష్టమైన ఖనిజాలు పారిశ్రామిక ముడి పదార్థాలు మాత్రమే కాదు అవి హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఉపయోగపడతాయి. సోలార్ పవర్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, ప్రతి ఎలక్ట్రిక్ వాహనం, విద్యుత్తు నిల్వ బ్యాటరీలు వంటివి క్లిష్టమైన ఖనిజాల ద్వారానే నిర్మాణం అవుతాయి'' అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతున్నామన్నారు. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నామని, ఆవిష్కరణల ప్రోత్సాహానికి సుస్థిరతకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు. ఐఐటీల ఆలోచనలు పరిశ్రమలను పునర్ నిర్వచిస్తాయి, ఆర్థిక వ్యవస్థలను పునర్మిస్తాయన్న డిప్యూటీ సీఎం భట్టి.. గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన టెక్నాలజీ, శాస్త్రీయ ఆవిష్కరణలలో దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు.