గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందడానికి కేంద్రం సహకారం కావాలి: సీఎం రేవంత్

ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  4 March 2024 7:35 AM GMT
prime minister, narendra modi, telangana tour, cm revanth reddy,

గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందడానికి కేంద్రం సహకారం కావాలి: సీఎం రేవంత్

ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. దీంతో పాటు రైల్వే అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైతో పాటు.. రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలతో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ సహకరిస్తున్నారనీ.. ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. అయితే.. రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడ్డామని చెప్పారు. కేంద్రంతో పదేపదే ఘర్షణ పడటం.. వ్యతిరేక వైఖరితో ఉంటే తెలంగాణ అభివృద్ధి వెనుకబడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉందుకు వెళ్తుందని చెప్పారు. తమ వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవని చెప్పారు సీఎం రేవంత్.

గుజరాత్‌లాగా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలంటూ ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రధానమంత్రి తమకు పెద్దన్నలాంటి వారని చెప్పారు. ఆదిలాబాద్‌కు నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహట్టి నిర్మించాలని అన్నారు. దీని కోసం భూసేకరణకు కావాల్సిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి కోరారు.

ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్‌లో ఇప్పుడు ప్రారంభించిన కార్యక్రమాలే నిదర్శనం అని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటై పదేళ్లు అవుతోందనీ.. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇక రాష్ట్రంలో హైవేలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఎన్టీపీసీ రెండో యూనిట్‌తో తెలంగాణ అవసరాలు తీరిపోతాయని చెప్పారు. 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని జాతికి అంకితం చేశామన్నారు. ఆర్థిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం జరుగుతుందని ప్రధనాఇ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో అభివృద్ధి పరంగా మరింత ముందుకు వెళ్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో దేశంలో ఇప్పటి వరకు 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

Next Story