ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీన పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని టూర్ నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సీఎస్ సమావేశమయ్యారు. ప్రధాని టూర్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధాని మోదీ పర్యటకు సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
గతంలో కూడా పలుసార్లు తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు సీఎం స్థాయిలో కేసీఆర్ ఆహ్వానించలేదు, హాజరుకాలేదు. అయితే అందుకు గల కారణాలను కూడా కేసీఆర్ చెప్పారు. కాగా దసరా రోజున తన జాతీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు ప్రధాని మోదీని కలుస్తారా? లేదా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రధాని మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రూ.10,472 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టును మోదీ ప్రారంభించనున్నారు. 12వ తేదీన విశాఖలో బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత.. మోదీ నేరుగా తెలంగాణకు రానున్నారు.