ఎల్లుండి నుంచే ప్రజాపాలన కార్యక్రమం.. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుంచి 'ప్రజాపాలన' కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
By అంజి Published on 26 Dec 2023 1:12 PM ISTఎల్లుండి నుంచే ప్రజాపాలన కార్యక్రమం.. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుంచి 'ప్రజాపాలన' కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల లోపునే 'అభయహస్తం' ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరుల చేతుల మీదుగా డిసెంబర్ 28న 'ప్రజాపాలన' కార్యక్రమం ప్రారంభం కానుంది. 28 డిసెంబర్, 2023 నుండి 6 జనవరి, 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించనున్నారు.
మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల లబ్ధి కొరకు ఈ 'ప్రజాపాలన' కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఓ వీడియోను విడుదల చేసింది. గ్రామసభల్లో దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, వారికి కావాల్సిన కుర్చీలు, టెంట్లు, తాగునీరు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఒకరోజు ముందు గ్రామాలు, వార్డుల్లో దండోరా వేయించనున్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాలు అర్హులకే అందించే దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.