హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీప్ ప్రభాకర్ రావు, ఛానల్ ఎండీ శ్రవణ్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. వారికి నోటీసులు ఇవ్వాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. వారిద్దరినీ ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రెడ్ కార్నర్ నోటీసుకు అనుమతించాలని సీబీఐకి సిట్ లేఖ రాసింది.
హైదరాబాద్ సిట్ విజ్ఞప్తికి సీబీఐ అనుమతించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్‌లకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ప్రభాకర్ యూఎస్‌లో చికిత్స తీసుకుంటున్నట్టు గుర్తించామని, శ్రవణ్ ఆచూకీ ఇంకా తెలియలేదని సిట్ బృందం తెలిపింది. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
కాగా ప్రభాకర్ రావుపై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది. అయితే ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్‌కు ప్రభాకర్ రావు తెలిపారు. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావుని హైదరాబాద్‌కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.