సామాన్యుడిపై మరో భారం.. తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు
Power charges to set to increase in Telangana from April 1.ఓవైపు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలతో
By తోట వంశీ కుమార్ Published on 24 March 2022 2:18 AM GMTఓవైపు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతుండగా.. ఇప్పుడు కరెంటు చార్జీల భారం కూడా పడనుంది. తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్దమైంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కరెంటు చార్జీల బాదుడు మొదలుకానుంది. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, ఎల్‌టీ (లోటెన్షన్)లో గృహేతర వినియోగదారులతో పాటు హెచ్‌టీ (హైటెన్షన్) వినియోగదారులకు యూనిట్‌కు రూ.1 పెంచారు.
దీంతో వినియోగదారులపై అదనంగా రూ.5,596 కోట్ల భారం పడనుంది. చార్జీల పెంపు ద్వారా రూ.6,831 కోట్లు సమకూర్చుకోవాలని డిస్కమ్‌లు ప్రతిపాదించగా.. రూ.5, 596 కోట్లకు కుదిస్తూ ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. కొత్త చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండగా.. బిల్లులపై ఆ ప్రభావం మే 1 నుంచి కనిపించనుంది. బుధవారం ఛార్జీల పెంపు వివరాలను మండలి ఛైర్మన్ శ్రీరంగారావు మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల మెరుగుదల కోసం డిస్కంలు రూ.35వేల కోట్లను ఖర్చు చేశాయి. కరెంటు కొనుగోలు వ్యయం బాగా పెరిగినందున కొంత భారం వేయక తప్పడం లేదు. అందుకనే కరెంటు ఛార్జీల పెంపునకు అనుమతించాం. 2016-17 తరువాత ఐదేళ్లకు 2022-23లో తిరిగి కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి.
- కటింగ్ షాపులు, కుటీర పరిశ్రమలకు, విద్యుత్ వాహనాలకు పెంపు లేదు. ఈ వర్గాలకు పాత చార్జీలే కొనసాగుతాయి. వ్యవసాయ రంగానికి పూర్తి ఉచితం
- గృహ వినియోగదారులకు యూనిట్‌కు 40 నుంచి 50 పైసల పెంపు
- ఇతర వర్గాలకు యూనిట్‌కు రూ.1 అదనం
- 50 యూనిట్ల లోపు వాడితే యూనిట్‌కు రూ.1.95
- 300 దాటితే యూనిట్‌కు రూ.9