గృహలక్ష్మికి మూడు రోజులు సమయం.. ఎవరిని మోసం చేయడానికి..? : పొన్నాల
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచన చేసిందా?
By Medi Samrat Published on 9 Aug 2023 8:21 PM ISTముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచన చేసిందా? దోపిడీ గురించే ఆలోచన చేసిందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రజలు నమ్మబలకడానికి చేసే ఎత్తుగడల రాజకీయాలే తప్ప.. ప్రజల గురించి శాశ్వత ప్రాతిపదికన చెప్పింది చేయకపోవడం.. చెప్పింది చేస్తున్నట్లుగా ఈ తొమ్మిది సంవత్సరాలు నటిస్తున్నారని అన్నారు. మొదట ఆరున్నర లక్షల డబుల్ బెడ్ రూమ్ అన్నారు.. తరువాత ఐదు లక్షలు అన్నారని.. డబ్బు ఇవ్వలేక ఐదు లక్షలను మూడు లక్షలు చేశారని ఆరోపించారు.
22 లక్షల ఇల్లు అవసరమని గుర్తించింది ప్రభుత్వం.. 1,89,000 ఇల్లులు శాంక్షన్ చేసి 89,000 ఇల్లులు మాత్రమే కట్టి ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారో కూడ తెలియదని అన్నారు. మరలా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి.. మహిళలకు ఏదో గొప్ప చేస్తున్నామని నాటకీయంగా ప్రకటన చేశారని విమర్శించారు.
గృహలక్ష్మికి మూడు రోజులు సమయం.. ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలన్నీ మహిళల పేరు మీద ఉన్నాయా..? కుల ధ్రువీకరణ పత్రం అందరూ రెడీగా పెట్టుకున్నారా..? ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇప్పుడు తీసుకుంటే మూడు రోజుల్లో వస్తుందా..? అని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు క్షమించరని అన్నారు.
ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను తీసుకొని వాళ్లకి బీసీల లక్ష రూపాయలు అంటూ ఇచ్చి.. ఇస్తున్నామని చెబుతున్నారు. ఈ నాటకాలకు తెరపడుతుందని అన్నారు. రాజకీయాలు కేవలం రాజకీయాల కోసం కాదు ప్రజల అభీష్టం, ప్రాంతాల అభివృద్ధి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమన్నారు. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు మార్చి తెలంగాణ నినాదంతో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పదం తీసేసి బిఆర్ఎస్ అని చెబుతున్నాడని విమర్శించారు.
తెలంగాణలో ఉన్న సెటిలర్లను కేసీఆర్ భయభ్రాంతులకు గురిచేశాడని ఆరోపించారు. ఇప్పుడు వాళ్ళ ఓట్ల కోసం భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టి ఓట్లు దండు కోవాలని నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. నేను దేశాన్ని ఉద్ధరిస్తా నాకు ఓటు వేయండి అని కేసీఆర్ మభ్యపెడుతూ కపట నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది.. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు.. సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు లేవు.. ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు.. ప్రభుత్వం నడపడం కోసమే ఈ మహానుభావుడు అప్పులు చేస్తున్నాడని ఆరోపించారు.
తనకు వచ్చే ఎక్సైజ్ ఆదాయం కోసం 15 రోజులు గడువు.. ప్రజలకు ఇచ్చే దానికోసం మాత్రం మూడు రోజులే గడువా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశంలో కూడా చర్చకి రమ్మన్నా కేసీఆర్ రారు.. నన్ను ఛాలెంజ్ చేస్తే ఒక ప్రముఖ ఛానల్లో ఐదు గంటల 45 నిమిషాలు చర్చ చేశామని గుర్తు చేశారు.