ప్రభుత్వ పెద్దలు వేధిస్తున్నారు.. ప్రెస్‌మీట్‌లో పొంగులేటి కన్నీళ్లు
కాంగ్రెస్ సభకు జనాలు రాకుండా అధికారుల సాయంతో ప్రభుత్వ పెద్దలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 2 July 2023 12:19 PM ISTప్రభుత్వ పెద్దలు వేధిస్తున్నారు.. ప్రెస్‌మీట్‌లో పొంగులేటి కన్నీళ్లు
ఖమ్మంలో సాయంత్రం కాంగ్రెస్ జనగర్జన సభ జరగనుంది. ఈ క్రమంలో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. సభకు భారీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. జనసమీకరణ కోసం నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సభకు జనాలు రాకుండా అధికారుల సాయంతో ప్రభుత్వ పెద్దలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్యకర్తలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను అడ్డుకుంటున్నారని.. కంటతడి పెట్టిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్టి సభకు వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.
అయితే.. కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు పొంగులేటి చెప్పారు. ఈ సందర్భంగా తన కోసం వస్తున్న వారిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు స్వచ్ఛంగా సభకు వస్తున్నారని.. వారినికి కూడా ప్రభుత్వ అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దాదాపు 1700 వాహనాలను సిద్ధం చేసుకున్నారని పొంగులేటి వివరించారు. వాహనాలను నిలిపి వెహికల్ సంబంధిత పత్రాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకుఇలా చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ జనగర్జన సభకు జనాలు రాకుండా చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వ వేధింపులకు ఎవరూ భయపడొద్దని.. సత్రాగ్రహ మార్గంలో వేధింపులను అడ్డుకోవాలని అన్నారు. దీని కోసం ఎంతదూరమైనా సరే వెళ్లాలని అన్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. వాహనాలు ఉంటే వాటిల్లో.. లేదంటే నడుచుకుంటూ అయినా సరే సభకు కచ్చితంగా ప్రజలు వస్తారని ఈ సందర్భంగా చెప్పారు.