తెలంగాణ వ్యాప్తంగా మొదలైన పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది.
By అంజి Published on 30 Nov 2023 7:08 AM ISTతెలంగాణ వ్యాప్తంగా మొదలైన పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు.. ఓటింగ్ మిషన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, 118 స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో ఒక చోట సీపీఐ, 111 చోట్ల బీజేపీ, పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన, 19 నియోజకవర్గాల్లో సీపీఎం, 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు, 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అయిదుగురు ఎమ్మెల్సీలు సహా 2,290 మంది అదృష్ట పరీక్షను ఎదుర్కొంటున్నారు.
2018లో తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో 73.37 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎంత పోలింగ్ నమోదవుతోందనేది ఆసక్తికరంగా మారింది. గతంతో పోలిస్తే పోలింగ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేనంతగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. నవంబర్ 28 నాటికే రూ.724 కోట్లకుపైగా నగదు పట్టుబడింది. బంగారం, వెండి, మద్యం కలుపుకుంటే.. రాష్ట్రంలో పట్టుబడిన మొత్తం రూ.1000 కోట్లు దాటుతుంది.
35,655 పోలింగ్ బూత్‌ల్లో 3.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని సుమారు 30 నియోజకవర్గాల్లో కీలక నేతలు బరిలో ఉన్నారు. ఏడుగురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ఎన్నికల బరిలో ఉండగా.. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల వైపు జనం ఆసక్తిగా చూస్తున్నారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటమే దీనికి కారణం. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పోరు ఆసక్తికరంగా మారింది.
కేటీఆర్ సిరిసిల్ల నుంచి బరిలో ఉండగా.. హరీశ్ రావు సిద్ధిపేట నుంచి పోటీ చేస్తున్నారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి బరిలో ఉండగా.. సనత్‌నగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. బాల్కొండ నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.