సరిహద్దు వద్ద అంబులెన్స్ లను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు.. అనుమతి కోసం ఏమి చేయాలంటే

Police stops ambulances coming from AP to Telangana. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణకు వ‌చ్చే క‌రోనా రోగుల‌ను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటూ

By Medi Samrat  Published on  10 May 2021 12:15 PM GMT
ambulances

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణకు వ‌చ్చే క‌రోనా రోగుల‌ను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దులో చాలా వరకూ అంబులెన్స్ లు ఆగిపోయాయి. ఇక కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద కూడా తెలంగాణ పోలీసులు ఈ రోజు ఉద‌యం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి క‌రోనా రోగుల‌తో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకుని వాటిని వెనక్కి పంపుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు చెందిన చాలా మంది క‌రోనా చికిత్స కోసం తెలంగాణకు వెళుతూ ఉన్నారు. అలా వెళుతున్న క‌రోనా రోగులను తెలంగాణ‌లోకి అనుమతించ‌ట్లేద‌ని పోలీసులు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చే ఇత‌ర‌ వాహనాలను మాత్రం పోలీసులు అనుమ‌తిస్తున్నారు. హైదరాబాద్‌లో క‌రోనా చికిత్స‌ల కోసం ఆసుప‌త్రుల్లో పడకలు, ఆక్సిజన్ సౌక‌ర్యాలు లేవ‌ని పోలీసులు చెబుతున్నారు.

వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లే వారికి ఏపీ పోలీసు అధికారులు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతి తప్పక తీసుకోవాలని స్పష్టం చేశారు. రోగికి బెడ్ ఉందని ఆసుపత్రి అంగీకారపత్రం ఉండాలని తెలిపారు. వైద్య చికిత్సకు ఏపీకి వచ్చి తెలంగాణకు తిరిగి వెళ్లేవారిని పోలీసులు అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డులు పరిశీలించాకే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. కర్నూలు పోలీసులు పుల్లూరు టోల్‌గేట్‌ వద్దకు చేరుకుని తెలంగాణ పోలీసులతో మాట్లాడారు. తమ ఆసుప‌త్రులలో ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, చేర్చుకుంటామ‌ని ఆయా ఆసుపత్రులు హామీ ఇస్తే కనుక అంబులెన్స్‌లను తెలంగాణలోకి విడిచిపెడుతున్నారు.


Next Story
Share it