వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
Police Stopped YS Sharmila convoy.వికారాబాద్ జిల్లా పర్యటనకు వెలుతున్న వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు
By తోట వంశీ కుమార్ Published on 11 Jun 2021 9:04 AM GMT
వికారాబాద్ జిల్లా పర్యటనకు వెలుతున్న వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేశారు. పరిగిలో వరి కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు శుక్రవారం ఉదయం వైఎస్ షర్మిల లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు. వికారాబాద్ జిల్లా చింతపల్లి దగ్గరకు రాగానే ఆమె కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేశారు. కొవిడ్ నిబంధనల కారణంగా షర్మిల కాన్వాయ్‌లో రెండు వాహనాలకే అనుమతి ఉంది. నిబంధనలను ఉల్లంఘించారంటూ కాన్వాయ్‌లోని ఇతర వాహనాలను చింతపల్లి దగ్గర పోలీసులు నిలిపివేయడంతో షర్మిల మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు పోలీసులకు, షర్మిల మద్దతుదారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అనంతరం ఐదు వాహనాల చొప్పున అనుమతి ఇచ్చారు. దీంతో కొద్ది సేపు అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం వైఎస్ షర్మిల.. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని ఐకేపీ సెంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ధాన్యాన్ని షర్మిల పరిశీలించారు. రైతులతో పాటే నేలపై కూర్చొని వారి సమస్యలను అడిగి తెలసుకున్నారు.ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వైఎస్ షర్మిలకు వివరించారు. తేమ శాతం,తాళు అంటూ మూడు నుంచి ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.