పోలీస్ కానిస్టేబుల్ రాతపరీక్ష.. హల్‌టికెట్‌పై ఫోటో అతికిస్తేనే అనుమతి.. నిమిషం నిబంధన
Police constable recruitment exam on Tomorrow.తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) యూనిఫాం
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2022 7:55 AM ISTతెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆదివారం(ఆగస్టు 28) పరీక్ష జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 6,61,196 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని ఇప్పటికే అధికారులు తెలిపారు.
అభ్యర్థులకు సూచనలు
- పరీక్షకు గంట ముందు నుంచే అంటే ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
- ఉదయం 10 గంటల తరువాత పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై నిర్దేశిత స్థలంలో అభ్యర్థి ఫోటోను గమ్‌తో అతికించుకోవాలి. దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫోటోనే వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్‌లు కొట్టొద్దు. ఫోటో లేకుంటే పరీక్షకు అనుమతించరు.
- పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి బ్యాగులు, సెల్‌ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్‌లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు.
- మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు. విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఏదీ ఉండదు.
- అభ్యర్థులు కేవలం హాల్‌టికెట్, పెన్‌తో మాత్రమే పరీక్ష కేంద్రంలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది.
- ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు మత సంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.
-పరీక్షపత్రం బుక్‌లెట్‌లో ఇంగ్లీష్-తెలుగు, ఇంగ్లీష్- ఉర్ధూ బాషల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఇంగ్లీష్ వెర్షన్‌నే పరిగణలోకి తీసుకోవాలి.
- హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.
60 మార్కులు వస్తే చాలు..
ఈ సారి కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో కనీస అర్హత మార్కుల్ని కుదించారు. సామాజిక వర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30 శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఐదు తప్పు సమాధానాలను ఒక మార్కును తగ్గిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే.. అనంతరం శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరు కావొచ్చు. అక్కడా విజయం సాధిస్తే తుది రాత పరీక్ష ఉంటుంది.