నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం.. సీఎం రేవంత్ అభినందనలు
ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి
By అంజి
నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం.. సీఎం రేవంత్ అభినందనలు
ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన కవయిత్రి, రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకమైన ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది.
ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని ఎంపిక చేసింది. కమిటీ ఎంపికను ఆమోదించిన ముఖ్యమంత్రి రమాదేవికి అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ 9, 2025 రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. తెలంగాణ భాషా దినోత్సవం సంబురాల్లో భాగంగా మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించనున్న కాళోజీ జయంతి వేడుకల్లో అవార్డును ప్రదానం చేయనున్నారు. రమాదేవిని సత్కరించడంతోపాటు అవార్డు కింద రూ.1,01,116 నగదు బహుమతిని అందజేయనున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన నెల్లుట్ల రమాదేవి వృత్తిరీత్యా సీనియర్ బ్యాంక్ మేనేజర్. రమ కలం పేరుతో కార్టూనిస్ట్‌గా, రచయిత్రిగా పేరు పొందారు. మనసు భాష (కవిత్వం)- 2011, రమణీయం(కార్టూన్లు)-2011, మనసు మనసుకూ మధ్య (కథలు)-2011, చినుకులు (నానీలు)-2021, తల్లి వేరు (కథలు)-2021, డీ కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్-2023, అశ్రువర్ణం (కవిత్వం)-2024, రమాయణం-1 (కాలమ్స్)-2024 ప్రచురించారు.