తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన ప్రపంచ గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. భూదాన్ పోచంపల్లి గ్రామం.. ప్రపంచ పర్యాటక విలేజ్‌గా పేరు గడించింది. యూనైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజమ్ ఆర్గనైజేషన్.. భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామం కోసం భారత్ నుండి 3 గ్రామాలు పోటీ పడ్డాయి. అందులో భూదాన్ పోచంపల్లి ఎంపికైంది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి డిసెంబర్ 2వ తేదీన అవార్డును అందించనున్నారు.
భూదానోద్యమంతో పోచంపల్లికి భూదాన్ పోచంపల్లిగా పేరు వచ్చింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా భూదాన్ పోచంపల్లిని పిలుస్తుంటారు. ఇక పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది. ఇక్కడి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో చీరలు నేస్తున్నారు. నిజాం రాజులతో పాటు అరబ్ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలు భూదాన్ పోచంపల్లి నుండి ఎగుమతి అయ్యేవి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా తదితర 100 దేశాలకు పైగా వేలాది పర్యాటకులు, విదేశీ ప్రతినిధులు భూదాన్ పోచంపల్లి గ్రామాన్నిని సందర్శించారు.