ఆ తర్వాత ఎన్నడూ కేసీఆర్ నన్ను కలవలేదు: ప్రధాని మోదీ

ఇందూరు జనగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

By అంజి  Published on  3 Oct 2023 6:27 PM IST
ఆ తర్వాత ఎన్నడూ కేసీఆర్ నన్ను కలవలేదు: ప్రధాని మోదీ

ఇందూరు జనగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని, ఎన్డీఏలో చేర్చుకోవాలని అభ్యర్థించారన్నారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ అడిగారని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాచరికం కాదని కేసీఆర్ కు చెప్పానని, ప్రజలు ఆశీర్వదించిన వాళ్లే పాలకులని చెప్పానన్నారు ప్రధాని. ఆ తర్వాత ఎన్నడూ కేసీఆర్ తనను కలవలేదన్నారు. నా కళ్లలోకి చూసే ధైర్యం సీఎం కేసీఆర్ కు లేదని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని.. తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందన్నారు.

ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయని.. ప్రపంచానికి కరోనా వ్యాక్సీన్ అందించిన ఘనత హైదరాబాద్‌దే అన్నారు ప్రధాని మోదీ. ఎంతోమంది బలిదానంతో తెలంగాణ ఏర్పడిందని, కానీ ఓ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుంటోందన్నారు. కేసీఆర్ ఆయన కొడుకు, మేనల్లుడు, కూతురు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ధనికులయ్యారని ఆరోపించారు. ఈ కుటుంబ పాలనకు తెలంగాణ యువత మరోసారి అవకాశం ఇవ్వవద్దని పిలుపునిచ్చారు.


Next Story