కాంగ్రెస్‌కు ఓటుతోనే సమాధానం చెప్పాలి: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని నారాయణపేటలో పర్యటించారు.

By Srikanth Gundamalla  Published on  10 May 2024 5:30 PM IST
pm modi, bjp, election campaign, narayanpet ,

 కాంగ్రెస్‌కు ఓటుతోనే సమాధానం చెప్పాలి: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని నారాయణపేటలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. మోదీ గ్యారెంటీ అంటే అభివృద్ధి, భద్రత, ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ట పెంచడం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్లు కట్టించడం.. 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత చికిత్స అందించడం అని చెప్పారు. అయితే.. తాము కాంగ్రెస్‌ నాయకుల్లా కాదనీ.. మోదీ గ్యారెంటీ అంటే కచ్చితంగా అమలు అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల వేళ ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు ప్రధాని మోదీ. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ధారించే ఎన్నికలు అని అన్నారు. గత పదేళ్లలో తెలంగాణకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని మోదీ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను అవినీతి ఏటీఎంల్లోకి మళ్లించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం నిధులు ఇస్తే.. బీఆర్ఎస్ నేతలు తమ జేబులు నింపుకొన్నారని ఆరోపించారు. ఇక తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్‌ సర్కార్‌లాగే రాష్ట్రాన్ని లూఠీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హామీలను విస్మరించి.. ఫేక్‌ వీడియోల దుకాణం తెరిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ యువరాజుకి అమెరికాలో ఓ రాజగురువు ఉన్నాడనీ.. దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోల్చి అవమానిస్తాడని ప్రధాని మోదీ అన్నారు. జాతి వివక్షతో మాట్లాడే కాంగ్రెస్‌కు హిందూ దేవుల్లను పూజించడం.. అయోద్యకు వెళ్లడం నచ్చదని ఆరోపించారు. దేశాన్ని కులాల వారీగా విభజించాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కాపాడేందుకు తాను చౌకీదార్‌గా ఉంటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అందుకు ప్రజలంతా అవినీతికి కేరాఫ్‌.. అభివృద్ధికి వ్యతిరేకమైన కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డీకే అరుణను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మహిళ అని కూడా చూడకుండా కాంగ్రెస్‌ డీకే అరుణ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోందనీ.. కాంగ్రెస్‌ నాయకులకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు.

Next Story