8వ విడత హరితహారం.. కోరుట్ల నర్సరీలో 2.60 లక్షల మొక్కలు పంపిణీకి రెడీ

Plantations and nursery ready for phase 8 Haritaharam. అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

By అంజి  Published on  19 July 2022 4:37 AM GMT
8వ విడత హరితహారం.. కోరుట్ల నర్సరీలో 2.60 లక్షల మొక్కలు పంపిణీకి రెడీ

అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏలా లక్షలాది మొక్కలు నాటుతూ ఆకుపచ్చని తెలంగాణను తయారు చేస్తోంది. గతంలో హరితహారానికి మొక్కలు కావాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాల్సి వచ్చేది. అది కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే గాని దొరక్కపోయేవి. ఇబ్బందులను గమనించిన రాష్ట్ర సర్కార్‌ దూరదృష్టితో పల్లె, పట్టణాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ప్రత్యేక నిధులతో నర్సరీలు ఏర్పాటయ్యాయి. ఆయా పంచాయతీ, పట్టణం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచుతున్నారు. ఎనిమిదో విడుత మొక్కల పంపిణీకి కార్యాచరణ సిద్ధమైంది.

ఎనిమిదో విడుతకు సిద్ధమైన కార్యాచరణ

జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో హరితహారం కింద మొక్కలు నాటాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాల్సి వచ్చేది. ఇక ఆ మొక్కలు ఎంతో వ్యయ ప్రయాసలు పడితే తప్ప చేతికిరాకపోయేవి. ఈ క్రమంలోనే మున్సిపాలిటీ అధికారులు పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేశారు. ఎనిమిదో విడత కోసం 30 రకాలతో 2.60 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. తీరొక్క మొక్కలతో హరితహారం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచారు. త్వరలోనే మొక్కలు నాటేందుకు ప్రణాళికలు కూడా పూర్తి చేశారు.


కోరుట్లలో ప్రత్యేక నర్సరీ

హరితహారానికి మొక్కల కొరత రాకుండా చూడాలని భావించిన అధికారులు పట్టణ ప్రగతి నిధులతో అయ్యప్ప గుట్ట వద్ద ఎకరన్నర స్థల విస్తీర్ణంలో రూ.30 లక్షలతో ప్రత్యేక నర్సరీ ఏర్పాటు చేయించారు. ఇందులో 2.60 లక్షల మొక్కలను పెంచుతున్నారు. మొక్కల రక్షణ కోసం నర్సరీ చుట్టూ ప్రత్యేక గోడను నిర్మించారు. మొక్కలకు నీరు అందించేందుకు బోరు బావిని తవ్వించడంతో పాటు, మొక్కలకు ఎండ నుంచి రక్షణ కోసం షేడ్ నెట్లను అమర్చారు. విత్తనాలు మొలకెత్తే సమయంలో మరింత రక్షణ కల్పించేందుకు పాలిథీన్‌ కవర్లలోకి మార్చి చర్యలు తీసుకుంటున్నారు. మొక్కల ఎదుగుదలకు నాణ్యమైన మట్టిని, ఎరువులను ఉపయోగించారు. దీంతో ఇప్పుడు నర్సరీ చిట్టడవిని తలపిస్తోంది.


పచ్చదనం నింపడమే లక్ష్యంగా..

8వ విడుత హరితహారం ప్రారంభంకాగానే పట్టణంలోని ప్రభుత్వ భూములు, రోడ్లకు ఇరువైపులా, ఇండస్ట్రీయల్‌ ఎరియాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల పరిసరాలు, ఇళ్ల ఆవరణలో, ప్రార్థన మందిరాలు, ఆలయ ప్రాంగణాలు, పోలీస్‌స్టేషన్‌, రెవెన్యూ, రైల్వేస్టేషన్‌ పరిసరాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు నిరుపయోగంగా వున్న ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటించాలని మున్సిపాలిటీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

నీడనిచ్చే సుమారు 30 రకాల మొక్కలు

నర్సరీల్లో పూలు, పండ్లు, నీడనిచ్చే సుమారు 30 రకాల మొక్కలు జామ, అల్లనేరేడు, చక్ర మల్లె, మందారం, నేరేడు, మల్లె, చామంతి, కోనా కార్పస్‌, వాటర్‌ ఆపిల్‌, గన్నేరు, నూరు వరహాలు, మైదాకు, గులాబీ, గుల్‌మోహర్‌, పెల్టో ఫోరం, దానిమ్మ, కానుగ, పారిజాతం, టెకోమా, శ్రీగంధం, నెమలి నార, వేప, టేకు, కదంబా, నిద్ర గన్నేరు, బాదాం, బోహమియా, స్పతోడియా, చింత, సీతాఫలం, నరేఫా, సిల్వియా వంటి మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. స్థానికంగా 2.50 లక్షల మొక్కలు నాటడమే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

''కోరుట్ల పట్టణాన్ని హరితమయం చేయడమే లక్ష్యంగా ఎనిమిదో విడుతలో 2.50 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించాం. స్థానికంగా ఉన్న యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం.'' అని కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌ మహ్మద్‌ ఆయాజ్‌ పేర్కొన్నారు.

Next Story