కేబినెట్ సబ్ కమిటీకి కులగణన రిపోర్ట్..పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లేనా?
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు.
By Knakam Karthik Published on 2 Feb 2025 4:56 PM ISTకేబినెట్ సబ్ కమిటీకి కులగణన రిపోర్ట్..పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లేనా?
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా బృందం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి కుల గణనకు సంబంధించిన రిపోర్టును సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన సర్వే తెలంగాణలో దాదాపు 50 రోజుల పాటు కొనసాగింది. 76 ప్రశ్నలతో ఈ సర్వేలో రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులు పాటు అన్ని వివరాలను సేకరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 3,899 మంది అధికారులు పాల్గొనగా.. 96.9 శాతం కుటుంబాలను అధికారులు సర్వే చేశారుఏ. ఈ సర్వేలో మొత్తం తెలంగాణలోని 3 కోట్ల 54 లక్షల మంది తమ వివరాలను రిజిస్టర్ చేసుకున్నారు. కాగా 3.1 శాతం మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొనలేదని.. కమిషన్ తన నివేదికలో తెలిపింది. కాగా ఈ కులగణన రిపోర్ట్‌పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన అనంతరం దానికి ఆమోదం తెలపనుంది. అనంతరం నివేదికను సిద్ధం చేసి ఈ నెల 5వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదించిన తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ కులగణన నివేదికను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అనంతరం కులగణనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించిన అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.
కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కోసం ఉత్తర్వులు ఇచ్చింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన సర్వే చేయించి విజయవంతంగా పూర్తి చేసి నివేదికను సిద్ధం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన దిశగా కులగణన సర్వే నివేదిక ఆమోదంతో ముందడుగు పడనుంది. కాగా ఈ నివేదిక త్వరలో జరగబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.