ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో మొదలైన ట్రెండ్.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చేరినట్టు కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విజయం సాధించడంతో ఆయన అభిమానులు తమ వాహనాల నంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా (పిఠాపురం ఎమ్మెల్యేకు చెందినవారు) అని రాసుకోవడం ప్రారంభించారు. వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది.
తాజాగా కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే ట్రెండ్ మొదలైంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడు కూడా తన ద్విచక్ర వాహనంపై ఇలాంటి పదాలు రాసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్‌కు చెందిన నక్కా అనిల్ తన వాహనం నెంబర్ ప్లాట్‌పై ''మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే గారి తాలుకా'' అని రాసుకున్నాడు. ఆయన తన బండిపై రాసిన వ్యాఖ్య ఫొటోలు, వీడియోలు జిల్లాలోని పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.