హైదరాబాద్: ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ పెన్‌డ్రైవ్ సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) చేతికి చిక్కడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. టాపింగ్ కేసులో ప్రధాన ఆధారంగా ఈ పెన్‌డ్రైవ్ మారినట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తన పదవీకాలంలో ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన కీలక వివరాలను ఈ పెన్‌డ్రైవ్‌లో స్టోర్ చేసినట్లు సిట్ గుర్తించింది.
పెన్‌డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నట్లు, వాటిలో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, అంతేకాకుండా హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ప్రొఫైల్స్ కూడా నమోదై ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ పెన్‌డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు ఉంచి సిట్ అధికారులు తీవ్రంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ టాపింగ్‌కు గురైన నెంబర్లను గుర్తించడం లో కూడా ఈ పెన్‌డ్రైవ్ కీలకంగా మారినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రభాకర్ రావు బృందం టాపింగ్‌కు సంబంధించిన చాలా ఆధారాలను ధ్వంసం చేసినప్పటికీ, ఈ పెన్‌డ్రైవ్ మాత్రం సిట్ చేతికి చిక్కడం దర్యాప్తులో కీలక మైలు రాయిగా మారింది.
కేసును నిరూపించడానికి ఈ డిజిటల్ ఆధారం అత్యంత బలమైన సాక్ష్యమని సిట్ స్పష్టం చేస్తోంది. ప్రభాకర్ రావు నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు ఎల్లుండి వరకు విచారణ కొనసాగించనున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ పెన్‌డ్రైవ్ ఆధారంగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫోన్ టాపింగ్ కేసులో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ, మీడియా వర్గాల్లో కలకలం రేపుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు మరింత సంచలనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.