ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
Petition in TS High court over inter first year exams.తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఈ నెల
By తోట వంశీ కుమార్ Published on 21 Oct 2021 1:14 PM ISTతెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఈ నెల 25 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు తల్లిదండ్రుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని పిటిషన్ లో వారు కోరారు. పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. అప్పటి ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రస్తుతం ద్వితియ సంవత్సరం చదువుతున్నారు. పరీక్షలు రాయకుండానే వారు రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యారు. అయితే.. 70 శాతం సిలబస్‌తో వారికి ఈ సారి ప్రథమ ఏడాది పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.
అధికారులతో విద్యాశాఖ మంత్రి సమీక్ష..
ఇదిలా ఉంటే.. 25 నుంచి నిర్వహించనున్న పరీక్షలపై అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కారణంగా ప్రమోట్ చేసిన విద్యార్థులకు పరీక్షలు పెడుతున్నామని.. నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రంలో ఐసోలేషన్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు గంట ముందు వచ్చినా.. పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. ప్రైవేటు కళాశాలు పరీక్షల నిర్వహణను సహకరించాలని.. ఈ టైంలో విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.