Telangana: శివలింగం లాంటి రాతిపై పర్షియన్ శాసనం
నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలో రాతిపై చెక్కిన పర్షియన్ శాసనం లభించినట్లు భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
By అంజి Published on 12 March 2024 2:35 AM GMTNext Story
Telangana: శివలింగం లాంటి రాతిపై పర్షియన్ శాసనం
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలో రాతిపై చెక్కిన పర్షియన్ శాసనం లభించినట్లు భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. నస్తాలిక్ కాలిగ్రఫీ శైలిలో ఉన్న ఈ పర్షియన్ శాసనం ఒక శిలపై చెక్కబడింది. దీనిపై కొంతమేర తెలుగులిపి కూడా ఉంది. ఇది శివలింగాన్ని పోలి ఉంది. ఈ శాసనం హైదరాబాద్ నిజాముల్ ముల్క్ అసఫ్ జా వంశానికి చెందిన 8వ నవాబు అయిన నవాబ్ ముకర్రం ఉద్ దౌలా బహదూర్‌కు చెందినదని అధికారులు తెలిపారు.
కొందరు ఔత్సాహికులు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కొల్లంపెంట సమీప అటవీ ప్రాంతంలో పురాతన దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న లింగాకార రాయిని ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారి భారత పురావస్తు శాఖ అధికారుల దృష్టిలో పడింది. ఏప్రిల్ 9, 1932 నాటి రచన, ఒక బంజరు భూముల్లో చెట్లు, మూలికలను నాటడం, తద్వారా దానికి బెహిష్తాన్ (అంటే తోట) అని పేరు పెట్టడం గురించి ప్రస్తావించబడింది. దానిపై రెవెన్యూ అధికారి జైన్ చంద్ర పేరు కూడా ఉంది. అప్పటి రెవెన్యూ అధికారి జైన్‌చంద్ర ద్వారా మహమ్మద్ ఇస్మాయిల్ పేరిట 3వ ధుల్హిజా 1350 హిజ్రి శకం 1932 ఏప్రిల్ 9న శాసనం రాయించినట్లు పేర్కొన్నారు.