మేడిగడ్డ బ్యారేజీపై నిజాలు ప్రజలకు తెలియాలి: సీఎం రేవంత్
సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారని, దేవాలయాలు ఎంత పవిత్రమైనవో రైతులకు ప్రాజెక్టులూ కూడా అంతే పవిత్రమైనవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 13 Feb 2024 7:04 AM GMTమేడిగడ్డ బ్యారేజీపై నిజాలు ప్రజలకు తెలియాలి: సీఎం రేవంత్
సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారని, దేవాలయాలు ఎంత పవిత్రమైనవో రైతులకు ప్రాజెక్టులూ కూడా అంతే పవిత్రమైనవని 5వ రోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ గురించి ప్రజలకు నిజానిజాలు తెలియాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం అన్నారు. "తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా తాగు, సాగునీటి కోసం రెండు వనరులున్నాయి. అవి కృష్ణా, గోదావరి జలాలు. కృష్ణా జలాలపై ఇప్పటికే శాసనసభలో చర్చించాం. వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు వివరించగలిగాం. ఇక రెండోది గోదావరి జలాలు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టాలని గతంలో పాలకులు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.38,500 కోట్ల అంచనాతో 2008లో టెండర్ల ప్రక్రియ చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యే నాటికే వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి" అని సీఎం రేవంత్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో గొప్పది.. అద్భుతం.. అని గత పాలకులు ప్రచారం చేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని సీఎం రేవంత్ అన్నారు. ''గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీడిజైన్ అనే పేరుతో తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టులో భారీ మార్పులు చేర్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అంటూ చివరకు రూ.38,500 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.1.47 లక్షల కోట్లకు పెంచారు. రీడిజైనింగ్ ఎలా చేశారు? రీడిజైనింగ్‌కు సంబంధించి ఇంజనీర్లు ఇచ్చిన డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడ? ఆ తర్వాత జరిగిన నిర్మాణం, నిర్వహణ.. ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నల్లాగే మిగిలాయి'' అని సీఎం రేవంత్ అన్నారు.
''మేడిగడ్డ బ్యారేజీ కింద ఇసుక కదలడం వల్లే కుంగిపోయిందని బీఆర్‌ఎస్ నేతలు అన్నారు. ప్రాజెక్ట్ రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. ఇంత జరిగితే.. బ్యారేజీ వద్దకు ఎవరూ వెళ్లకుండా.. చూడనీయకుండా పోలీసు నిఘా పెట్టారు. ప్రాజెక్ట్ పై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రాజెక్టు పరిస్థితి పై వివరాలతో కూడిన నివేదికని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌నూ బీఆర్‌ఎస్ తప్పుబట్టింది. కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టాక.. మేడిగడ్డ వద్ద జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది అధికారులు కార్యాలయాల నుంచి ఫైళ్లు మాయం చేశారని మీడియాలో వచ్చింది. దీంతో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల దగ్గర జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించాం. విజిలెన్స్ కమిటీ మొదట ఓ నివేదిక ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు నిర్వహణలో నిర్లక్ష్యంపై అనేక విషయాలను నివేదికలోప్రస్తావించింది'' అని సీఎం అన్నారు.