న్యాయవాది దంపతుల హత్య కేసులో కీలక ఆధారాలు.. ముగ్గురి అరెస్టు
Peddapalli Advocate Couple Murder Case. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన న్యాయవాది దంపతుల హత్య కేసులో కీలక ఆధారాలు.
By Medi Samrat Published on 19 Feb 2021 5:10 AM GMTతెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన న్యాయవాది దంపతుల హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. నిన్న మహారాష్ట్ర సరిహద్దులో నిందితులు కుంట శ్రీను, శివందుల చిరంజీవి, అక్కపాక కమార్‌లను అరెస్టు చేశారు. న్యాయవాదుల హత్య జరిగిన 24 గంటల్లో వీరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఐజీ తెలిపిన వివరాల ప్రకారం..
న్యాయవాది వామన్‌రావు, కుంట శ్రీనుది గుంజపడుగు గ్రామం. గ్రామంలో వీరిద్దరికి గత కొంత కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. న్యాయపరంగా శ్రీనుని వామన్‌రావు గట్టిగా ఎదుర్కొంటున్నారు. దానిని తట్టుకోలేక వామన్‌రావును హత్య చేయాలని శ్రీను నిర్ణయించాడు. విచారణలో శ్రీను ఎక్కడా రాజకీయ కారణాలు చెప్పలేదని, శ్రీను, చిరంజీవి కలిసి హత్య చేశారని, అందుకు కుమర్ కూడా సహకరించినట్లు చెప్పారు. ఈ కేసులో ఏ1 కుంట శ్రీను నిందితుడిగా, ఏ2 శివందుల చిరంజీవి, ఏ3గా అక్కపాక కుమార్‌లను చేర్చారు. వీరిని శుక్రవారం కోర్టులో హాజరు పర్చనున్నారు.
అయితే.. కొత్త సిమ్ కార్డు సాయంతో నిందితులను అరెస్టు చేశామన్నారు. కాల్‌డేటా ద్వారా కీలక ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. హత్యోదంతానికి ముందు వామన్‌రావు కదలికల గురించి కుంట శ్రీనివాస్‌కు, మరో నిందితుడు అక్కపాక కుమార్‌కు మధ్య పలుమార్లు సంభాషణలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. మధ్యాహ్నం 12.02 నుంచి 12.30 మధ్యలో 10 సార్లు వారు మాట్లాడుకున్నట్లు తేలిందని, కొంతసేపటి తర్వాత నిందితులిద్దరూ సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేసుకున్నారని వెల్లడించారు. నిందితుడు శ్రీను పారిపోయాక కొత్త సిమ్‌కార్డును వినియోగించి కుమార్‌తో టచ్‌లో ఉన్నాడని, పోలీసుల దర్యాప్తు తీరు గురించి తెలుసుకుంటూ ఫాలో అవడం మేమే గమనించామన్నారు. ఈలోగా మృతుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.