Hyderabad: కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేస్తే.. ఇకపై భారీ జరిమానా

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పార్కింగ్ చేస్తే రూ.200 నుంచి రూ.2000 వరకు పోలీసులు జరిమానా విధిస్తున్నారు.

By అంజి  Published on  14 March 2023 8:33 AM IST
Hyderabad, Durgam Cheruvu, cable bridge

కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేస్తే.. ఇకపై భారీ జరిమానా

హైదరాబాద్: అద్బుతమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్.. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలకు విలువైన ప్రదేశం మారింది. కేబుల్‌ బ్రిడ్జ్‌ను చూసేందుకు, ఇక్కడ ఫొటోలు దిగేందుకు ప్రతి రోజు సాయంత్రం ఎంతో మంది వస్తుంటారు. అలా వచ్చి వెళ్లి పోయే వారు.. రెండు/నాలుగు చక్రాల వాహనాలతో అక్కడికి వెళ్లే ముందు హెచ్చరికను గమనించండి. ఇటీవలి నెలల్లో సంబంధిత అధికారుల నుండి హెచ్చరికలు ఉన్నప్పటికీ, చాలా మంది సందర్శకులు తమ వాహనాలను వంతెనపై నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత.. ఎక్కువ మొత్తంలో వాహనాలు బ్రిడ్జిపై ఆగుతున్నాయి.

అయితే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పార్కింగ్ చేస్తే రూ.200 నుంచి రూ.2000 వరకు పోలీసులు జరిమానా విధించనున్నారు. కొందరు సెల్ఫీలను తీసుకోవడానికి ఈ ఐకానిక్ స్పాట్‌కి తరలివస్తుంటే, మరికొందరు సమయాన్ని గడపడానికి ప్రధాన ప్రదేశంగా వస్తున్నారు. తమ కెమెరా ఫోన్‌లను సిద్ధంగా ఉంచుకుని వచ్చిన వారు తమ కారును రోడ్డుపై పార్క్ చేసి, బయటకు వచ్చి బ్రిడ్జిపై ప్రాణాంతకంగా వంగి ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేబుల్‌ బ్రిడ్జ్‌ దగ్గర ఆగే వాహనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు.

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వారు చలాన్‌ను కొట్టబోతున్నారు. పోలీసులు చీకటిగా ఉన్నందున ఏం పట్టించుకోరని మీరు భావిస్తే.. పప్పులో కాలేసినట్లే, రాత్రిపూట వంతెనను పర్యవేక్షించడానికి వారి వద్ద ప్రత్యేక కెమెరాలు ఉన్నందున మరోసారి ఆలోచించండి.

వంతెనపై పార్కింగ్ చేసినందుకు జరిమానా రూ. 200 నుండి రూ. 2,000 వరకు ఉంటుంది. కొన్ని ఫోటోలు, పుట్టినరోజు వేడుకలు లేదా స్నేహితులతో సరదాగా గడపడానికి చాలా ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ''ప్రజలు తమ వాహనాలను వంతెనపై పార్క్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను అర్థం చేసుకోవడం అత్యవసరం. వంతెనను ఉపయోగించే సందర్శకులు, ప్రయాణీకుల భద్రత చాలా ముఖ్యమైనది. నిర్లక్ష్య ప్రవర్తనను సహించము'' అని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

బ్రిడ్జిపై పార్కింగ్ నిషేధాన్ని అమలు చేసేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. గస్తీని పెంచారు, ముఖ్యంగా ఆలస్య సమయాల్లో, కెమెరాలు 24×7 ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నాయి. ''మేము వంతెన సందర్శకులందరికీ భద్రత కల్పించాలనుకుంటున్నాము. కానీ అది జరగడానికి మాకు ప్రజల సహకారం అవసరం'' అని అధికారి తెలిపారు.

Next Story