Telangana: గుడ్‌న్యూస్.. ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 16 Feb 2024 6:41 AM ISTTelangana: గుడ్‌న్యూస్.. ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, క్రీడాకారుల విభాగాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వర్టికల్ రిజర్వేషన్లకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం.56/1996 ఉత్తర్వుల రద్దు చేసింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు, రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో నియామకాలకు సమాంతర రిజర్వేషన్లు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 నిబంధనలు సాధారణ పరిపాలనశాఖ స్పెషల్‌గా జారీ చేస్తుందని తెలిపారు. మహిళలకు ఆయా కేటగిరీల్లో వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేయకూడదని, రాజ్యాంగం రూల్స్ ప్రకారం సమాంతరంగా అమలు చేయాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుకు అనుగుణంగా టీఎస్‌పీఎస్సీ, ఇతర నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మహిళాశిశు సంక్షేమశాఖ రోస్టర్‌పాయింట్ లేకుండా సమాంతర రిజర్వేషన్లు అమలు చేసేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.