'ఫ్లై యాష్ తరలింపులో భారీగా అక్రమాలు'.. మంత్రి పొన్నంపై పాడి కౌశిక్ సంచలన ఆరోపణలు
ఫ్లై యాష్ తరలింపులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 11 Jun 2024 1:11 PM IST'ఫ్లై యాష్ తరలింపులో భారీగా అక్రమాలు'.. మంత్రి పొన్నంపై పాడి కౌశిక్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: రామగుండంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి)లో ఫ్లై యాష్ రవాణాలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) ఎమ్మెల్యే పి.కౌశిక్ రెడ్డి జూన్ 11 మంగళవారం ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘‘ఎన్టీపీసీ రామగుండంలో ఫ్లై యాష్ రవాణాకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారు. ఒకే లారీలో 32టన్నులకు బదులు 72టన్నుల బూడిదను రవాణా చేస్తూ వేబిల్లుల్లో లోడ్ తూకం పేర్కొనకపోవడంతో అదనపు లోడుపై రోజుకు రూ.50లక్షల ఆదాయం సమకూరుతోంది. పొన్నం ప్రభాకర్ అన్నయ్య కొడుకు అనూప్ ఈ డబ్బు వసూలు చేస్తున్నాడు’’ అని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
సామర్థ్యానికి మించి రవాణా చేస్తున్న 13 లారీలను తానే పట్టుకున్నానని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ వాటిలో కేవలం 2 లారీలను మాత్రమే సీజ్ చేసిందన్నారు. రవాణా శాఖ మంత్రి ఒత్తిడికి అధికారులు తలొగ్గుతున్నారని, వారు తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. తన నుండి, బీఆర్‌ఎస్ శ్రేణుల నుండి తప్పించేందుకు హుస్నాబాద్ మీదుగా లారీలను తరలిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే తెలిపారు.
ఇంత జరుగుతున్నా ఎన్టీపీసీ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ''అవినీతికి పాల్పడే అందరి పేరు రెడ్ బుక్‌లో రాస్తున్నాం, మేం అధికారంలోకి వచ్చిన నాడు అందరి బండారం బయటపెడుతామన్నారు. ఇది బెదిరింపు కాదు, మీ బాధ్యత మీకు గుర్తు చేస్తున్నాం'' అని స్పష్టం చేశారు. అక్రమార్కులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.