6 గ్యారంటీల్లో.. 5 గ్యారంటీలను అమలు చేశాం: సీఎం రేవంత్
ప్రజలకు జవాబుదారి పాలన అందిస్తూ, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు.
By అంజి Published on 3 July 2024 5:26 AM GMT6 గ్యారంటీల్లో.. 5 గ్యారంటీలను అమలు చేశాం: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రజలకు జవాబుదారి పాలన అందిస్తూ, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిద్దాల్సిన గురుతరమైన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. సచివాలయంలో 29 విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు.
ఇకనుంచి తాను స్వయంగా వారానికి ఒక జిల్లా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో అయిదు గ్యారంటీలను అమలు చేసిందని సీఎం చెప్పారు. తర్వాత వంద రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచి పోయాయని, ఇకపై అధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు.
విధి నిర్వహణలో క్రమశిక్షణ, శాఖల పనితీరును పరిశీలించడానికి వారానికోసారి విధిగా జిల్లాల పర్యటనలు, నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించడం, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం వంటి అనేక అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రిగారు దిశానిర్ధేశం చేశారు. జిల్లాల్లో చాలాచోట్ల కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను అప్పుడప్పుడు పరిశీలించాలని చెప్పారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనల సందర్భంగా సత్వరమే స్పందించాలని అన్నారు.