గవర్నర్ జోక్యం.. ఓయూ టాపర్‌కు గోల్డ్ మెడల్
గవర్నర్ తమిళిసై జోక్యంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌సి జెనిటిక్స్ టాపర్ విష్ణు వచన బంగారు పతకాన్ని స్వీకరించడానికి మార్గం సుగమమైంది.
By అంజి Published on 30 Oct 2023 1:30 PM ISTగవర్నర్ జోక్యం.. ఓయూ టాపర్‌కు గోల్డ్ మెడల్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జోక్యంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీలో టాపర్‌గా నిలిచిన విష్ణు వచన మురపాక.. గోల్డ్ మెడల్ అందుకోవడానికి మార్గం సుగమమైంది. స్పాన్సర్ లేరన్న కారణంతో విష్ణు వచనకు ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ నిరాకరించింది. ఈ విషయాన్ని విష్ణు వచన.. గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విజ్ఞప్తిని అనుసరించి, గవర్నర్ ప్రముఖ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్‌ను సంప్రదించారు. ఇది టాపర్‌కు బంగారు పతకాన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. అక్టోబర్ 31న జరిగే కాన్వొకేషన్ సందర్భంగా విష్ణు వచనకు ప్రతిష్టాత్మక బంగారు పతకాన్ని అందజేస్తామని రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అంతకు ముందు టాపర్ విష్ణు వచనకి స్పాన్సర్ లేనందున గోల్డ్ మెడల్ ఇవ్వలేకపోతున్నామని ఉస్మానియా యూనివర్సిటీ తెలిపింది. ఆమె కాన్వొకేషన్‌కు హాజరు కావడానికి కూడా ఇవ్వలేదు. దీనిపై మనస్థాపం చెందిన విష్ణు వచన గవర్నర్ తమిళిసైకు ఒక లేఖ రాశారు. వెంటనే గవర్నర్ స్పందించారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లాలను సంప్రదించారు. వారు జెనెటిక్స్ టాపర్‌కు బంగారు పతకాన్ని స్పాన్సర్ చేయడానికి ఇద్దరూ ఉదారంగా ముందుకొచ్చారు.
జెనెటిక్స్ రంగంలో విశేష ప్రతిభ కనబరిచి మెరిట్‌లో ఉత్తీర్ణురాలైన విష్ణు వచనను గుర్తించినందుకు గవర్నర్ తమిళిసై భారత్ బయోటెక్ సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ దాతృత్వ సంజ్ఞ, వైజ్ఞానిక సమాజంలోని ప్రతిభను గుర్తించి, వాటిని పెంపొందించడంలో భారత్ బయోటెక్ యొక్క దృఢమైన నిబద్ధతకు ఉదాహరణ అని ఆ ప్రకటన పేర్కొంది. విష్ణు వచన, హైదరాబాద్ నివాసి, 2022లో ఉస్మానియా యూనివర్సిటీలోని జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ విభాగం నుండి జెనెటిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె CSIR-CCMB (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో డాక్టరల్ డిగ్రీ (Ph.D.) అభ్యసిస్తున్నారు. 2020-2022 బ్యాచ్‌కు చెందిన ఎంఎస్‌సి జెనెటిక్స్ విద్యార్థి అయిన విష్ణు వచనకు 10కి 8.75 సిజిపిఎ సాధించి ప్రథమ డివిజన్‌లో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు.