రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు ముగ్గురికి ప్రాణం పోశాడు. నల్గొండ జిల్లాలోని కాంచనపల్లెకు చెందిన పెయింటర్ కొప్పోలు సంపత్ కుమార్ మే 1న నల్గొండలోని హాలియా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆ యువకుడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ ముగిసిన తర్వాత మే 4వ తేదీన సంపత్ కుమార్ బ్రెయిన్ డెడ్‌తో మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
అయితే మృతుడి తల్లి పర్వతమ్మ తన కొడుకు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవందన్ దాన కార్యక్రమం కింద సంపత్ కుమార్ అవయవాలను అవసరమైన రోగులకు దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. వైద్యులు 5 అవయవాలలో కాలేయం (01), మూత్రపిండాలు (02), కార్నియాస్ (02) లను వెలికితీసి, జీవందన్ అవయవ దాన మార్గదర్శకాల ఆధారంగా రోగులకు కేటాయించారు.