శనివారం వరకు జాగ్రత్త.. వేడిగాలులపై తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్..!

రానున్న 48 గంటల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

By Knakam Karthik
Published on : 23 April 2025 3:38 PM IST

Telangana, Indian Meteorological Department, Heat Wave, Orange Alert

శనివారం వరకు జాగ్రత్త, వేడిగాలులపై తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్

రానున్న 48 గంటల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో 41-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది.

కాగా రానున్న శనివారం వరకు వేడిగాలుల పరిస్థితులు కొనసాగుతాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో.. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

అయితే తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) డేటా ప్రకారం మంగళవారం, బుధవారం మధ్య వివిధ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 44 డిగ్రీల సెల్సియస్ దాటిందని తెలిపింది. ఆదిలాబాద్‌లోని తలమడుగులో గరిష్ట ఉష్ణోగ్రత 44.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఆ తర్వాత కామారెడ్డి జిల్లా మేనూరు (మద్నూర్ మండలం)లో 44.5 డిగ్రీల సెల్సియస్, నిర్మల్ జిల్లా పెంబిలో 44.4 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఆసిఫాబాద్ (కుమ్రం భీమ్ ఆసిఫాబాద్)లో గరిష్ట ఉష్ణోగ్రత 44.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా, నిజామాబాద్‌లోని కోటగిరిలో 44 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

Next Story