మరో నాలుగు రోజులు మంటలే.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
Orange alert issued for Telangana.వేసవి ముదరక ముందే తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం
By తోట వంశీ కుమార్ Published on 31 March 2022 12:33 PM ISTవేసవి ముదరక ముందే తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ కారణంగా రోడ్లపైకి రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇదిలా ఉంటే.. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో నాలుగు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుండి నాలుగు డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో ఆరెంజ్ అల్టర్‌ను జారీ చేసింది.
శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని ఉత్తర, వాయువ్య జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదంటూ సూచించింది. ఎండ నుండి కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు కూడ తీసుకోవాలని తెలిపింది. ఎండలు తీవ్రం అయిన నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను సిద్దం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు
సాధారణంగా ఎండల తీవ్రతను బట్టి వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయితే.. ఎల్లో (హీట్ వేవ్ వార్నింగ్) అలర్ట్, సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు నమోదైతే ఆరెంజ్ అలర్ట్, సాధారణం కంటే ఆరు డిగ్రీలకు పైగా నమోదు అయితే రెడ్ అలర్ట్, సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయితే వైట్ అలర్ట్ జారీ చేస్తుంది.