హైదరాబాద్: అన్ని మీ సేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్‌డేట్ చేసినట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇకై ఏ,బీ,సీ,డీ కేటగిరీల కింద సర్టిఫికెట్లు పొందవచ్చని తెలిపారు. తెలంగాణ చట్టం నవంబర్ 15-2025, జీవో.ఎంఎస్. నంబర్ 9 (షెడ్యూల్ కులాల శాఖ, 10-04-2025) ప్రకారం ఈ వర్గీకరణ వ్యవస్థను అమలు చేశామన్నారు. ఇకపై ప్రజలు తమ వర్గానికి సరిపడే ధ్రువపత్రాలను సులభంగా పొందవచ్చని, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాస్ట్ సర్టిఫికెట్ల రీఇష్యూ సదుపాయాన్ని కూడా ప్రారంభించామన్నారు.
కొత్త మార్పులతో ప్రతి ఏటా మీసేవల ద్వారా ఎస్సీ సర్టిఫికెట్లు కోసం అప్లికేషన్ చేసే 4 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో రిజర్వేషన్లను సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు జరుగుతాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువపత్రాలను పునర్ ముద్రణ సదుపాయం ప్రారంభించినట్లు తెలిపారు. పునర్ముద్రిత ధ్రువపత్రంలో ఆమోదించిన అధికారి, తేదీ వివరాలు స్పష్టంగా ఉంటాయన్నారు. ఇది ప్రజలకు మరింత సౌలభ్యం కలిగించే చర్య అని మంత్రి వివరించారు.