విద్యార్థులకు శుభవార్త.. ఇక నుంచి పుస్తకాలు చూసి పరీక్షలు రాయొచ్చు
Open book exams likely for diploma courses in Telangana.పరీక్షలు అంటే చాలా మందికి భయం ఉంటుంది. పరీక్షల్లో చూసి
By తోట వంశీ కుమార్ Published on 18 July 2021 2:49 AM GMTపరీక్షలు అంటే చాలా మందికి భయం ఉంటుంది. పరీక్షల్లో చూసి రాయడం నేరం. అయితే.. ఇక నుంచి ఆ భయం అక్కరలేదు. ఎంచక్కా పుస్తకాలు దగ్గర పెట్టుకుని మరీ పరీక్ష రాయొచ్చు. అదే.. ఓపెన్ బుక్ పరీక్షల విధానం. ఇప్పటి వరకు చర్చల వరకే ఉన్న ఈ ప్రతిపాదన ఈ సంవత్సరం నుంచి కార్యరూపం దాల్చుతుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం(2021-22) నుంచే అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్) కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్శిటీల్లో ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తుండగా.. మరికొన్ని వర్శిటీలు విద్యార్ధులకు స్టడీ మెటీరియల్ అందించి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్యన కొన్ని యూనివర్శిటీలో ఓపెన్ బుక్ పరీక్ష విధానాన్ని అమలు చేశాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం దీనిని అమలు చేయనున్నారు. ఈ ఓపెన్ బుక్ పరీక్షల విధానంలో సబ్జెక్టుపై పట్టు ఉంటేనే పరీక్షలు బాగా రాయగలుగుతారు. సబ్జెక్టుపై పట్టు లేకపోతే మనకు ఇచ్చిన ప్రశ్నాపత్రంలో ప్రశ్న చూసి బుక్ లో దాని సమాధానం కోసం వెతకడం అనేది చాలా టైమ్ తీసుకుంటుంది.
ఇక సబ్జెక్టుపై పట్టు ఉంటే మాత్రం ఓపెన్ బుక్ పరీక్షల విధానంలో పరీక్షలు బాగా రాయగలుగుతారు. కొత్త విధానాన్ని అమలు చేయాలంటే ప్రశ్నపత్రాలు, బోధన తీరు కూడా మారాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఎలా వచ్చినా జవాబులు రాసేలా విద్యార్థులను సంసిద్ధులను చేయాలి. కరోనా నేపథ్యంలో ఈ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఏఐసీటీఈ, యూజీసీ సైతం పరీక్షలను ఓపెన్ బుక్ విధానంలో పెట్టుకోవచ్చని, అది ఆయా వర్సిటీల ఇష్టమని స్పష్టం చేశాయి.
అయితే.. ఈ విధానం అనేది అన్ని సబ్జెక్టులకు ఉండకపోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. ఏటా సుమారు తెలంగాణలో 54 ప్రభుత్వ, 77 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 25 వేల మంది చేరుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ (సీ21)తో పాటు ఓపెన్ బుక్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. అయితే ఆయా సబ్జెక్టులకు మాత్రమే ఓపెన్ బుక్ విధానం ఉండాలనే దానిపై కోర్సుల వారీగా నియమించిన కమిటీల సిఫారసులను బట్టి అమలు చేయనున్నారు.
కోర్సుకు ఒకటీ రెండు సబ్జెక్టులకు అమలు చేసే అవకాశముందని ఎస్‌బీటెట్ కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. ఇప్పటికే అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేసేందుకు అనుమతికి నిర్వహించే పరీక్ష (ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్) ఓపెన్ బుక్ విధానంలో జరుగుతోందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. అయితే ఈ పద్దతిని ఈ ఏడాది పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రారంభిస్తున్నామని.. త్వరలో దీనిపై అధ్యయనం చేసి ఇంజినీరింగ్‌తోపాటు డిగ్రీలోనూ కొన్ని సబ్జెక్టుల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.