ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియకు రేపే ఆఖరు
ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
By అంజి Published on 16 Jan 2024 7:35 AM ISTప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియకు రేపే ఆఖరు
ప్రజాపాలన కార్యక్రమం కింద స్వీకరించి అభయహస్తం పథకాల దరఖాస్తు ఆన్‌లైన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆధార్, రేషన్ కార్డును క్రోడీకరించి దరఖాస్తుల్లోని సమాచారాన్ని పోల్చి చూస్తున్నారు. పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ దాదాపు పూర్తైనట్లు సమాచారం. రెండు రోజులు సెలవులు రావడంతో తేదీని పొడిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో 1.25 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. వీటి ఆధారంగా ఐదు గ్యారంటీల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
కాగా త్వరలోనే 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు వేగంగా జరుగుతోంది. ఈ ఐదు గ్యారంటీల లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసే పనిలో పడ్డారు. దరఖాస్తుల ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. గత నెల 28 నుంచి ఈనెల 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా 16 వేల 392 గ్రామాలు, 710 మున్సిపల్ వార్డుల పరిధిలోని కోటి 11 లక్షల 46 వేల 293 కుటుంబాల పరిధిలో ప్రజాపాలన నిర్వహించగా, కోటి 25 లక్షల 84 వేల 383 దరఖాస్తులు అందాయి.
ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500, రూ.500కు గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, చేయూత ఫించన్లు, గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ పథకంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం, అమరవీరుల కుటుంబాలకు స్థలం కోసం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. కాగా త్వరలోనే ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుల్లోని వివరాలు నిజమా? కాదా? అని అధికారులు పరిశీలించనున్నారు.