తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌తో ఒకరి మృతి
One person died due to Black Fungus in Telangana. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఈ వ్యాధిలో మృతి చెందారు.
By తోట వంశీ కుమార్ Published on 14 May 2021 8:12 AM ISTకరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు మ్యుకర్ మైకోసిస్( బ్లాక్ ఫంగస్) ఆందోళనకు గురి చేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ లతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఈ వ్యాధిలో మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతున్న నిర్మల్ జిల్లా బైంసా డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి మధుమేహంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇటీవలే కరోనా కూడా సోకింది. చికిత్స అనంతరం కోవిడ్ నుంచి కోలుకున్నాడు. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ముక్కు, కళ్ల నుంచి ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించిందని.. ఈక్రమంలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
కాగా.. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. ఈ కేసులు కూడా ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చాయన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. సాధారణంగా కరోనా రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీనికి తోడు ఆక్సిజన్ స్థాయి తగ్గిన వారికి స్టిరాయిడ్స్ అందిస్తుంటారు. అవి వ్యాధి నిరోధక శక్తిపై కొంత ప్రభావాన్ని చూపుతాయి. దానికి మధుమేహం తోడైతే.. బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉండవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు.
ఆందోన వద్దు..
బ్లాక్ ఫంగస్ కొత్తది కాదని.. తొలి దశలో కూడా గాంధీలో చికిత్స పొందిన 10 మంది కరోనా రోగుల్లో దీనిని గుర్తించామన్నారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. ఒకరిద్దరు తప్ప.. అందరూ చికిత్సతో కోలుకున్నారని.. కరోనా రోగులందరికి ఇది రాదన్నారు. గాంధీలో ప్రస్తుతం ముగ్గురిలో ఈ లక్షణాలు కనిపించాయని.. వారు కరోనాతో పాటు మధుమేహంతో చాలా రోజులుగా ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇక్కడకు వచ్చారన్నారు. కరోనా తగ్గడానికి స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్ ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదన్నారు.
దీని లక్షణాలు ఇవి..
బ్లాక్ ఫంగస్ కారణంగా ముఖంలోని ఏదైనా ఒక భాగంలో నొప్పి మొదలవుతుంది. ముక్కు, కండ్ల చుట్టూ ఎర్రగా మారి వాపు వస్తుంది. ఫలితంగా కనురెప్పలు వాలిపోవడం, కండ్లు అసాధారణంగా ఉబ్బడం, కనుగుడ్ల కదలికలు తగ్గడం జరుగుతాయి. జ్వరంతోపాటు తలనొప్పి, దగ్గు మొదలవుతుంది. అంగిలిపై నల్లటి మరకలు ఏర్పడుతాయి. దంతాలలో నొప్పి వస్తుంది. రక్త వాంతులు రావొచ్చు. మానసిక సంతులన దెబ్బతింటుంది. ఈ ఫంగస్ మెదడులో చేరితే మరణం తప్పదని ఢిల్లీకి చెందిన డాక్టర్ లహానే చెప్పారు.