భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారి గూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోని ఓ ఇంటి వరండాలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. వరండాలో ఎర్రటి గుడ్డలో కట్టేసి పూజా సామగ్రిని ఉంచడం గ్రామస్తుల్లో భయాందోళనలకు కారణమైంది.
ఆదివారం అమావాస్య కావడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఈ క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో ఇంటి యజమాని ఇంట్లోపల నిద్రిస్తున్నారని, తెల్లవారుజామున బయటకు వచ్చి చూసేసరికి ఈ దృశ్యం కనిపించిందని తెలిపారు. ఈ విషయం తెలియగానే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి క్షుద్ర పూజలు గ్రామంలో భయ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.